Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను విముక్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ రోజు పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
భైంసా పరిస్థితి చూస్తే పాకిస్థాన్లో ఉన్నామా అనే భయం కలుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులు, మతోన్మాదులు, మజ్లిస్ గుండాలకు భైంసా నిలయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ సమయంలో ముథోల్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. ఇక ఆ భయాలకు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పారు
ఓ 30 రోజులు ఓపిక పట్టాలని ప్రజలను కోరారు. ముథోల్, భైంసాను రక్షించుకోవచ్చని సూచించారు. తెలంగాణలో అసెంబ్లీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. దసరా పండగ తర్వాత మళ్లీ జనాల వద్దకు వస్తున్నారు. వరస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా అందుకు తగ్గట్టు కౌంటర్ ఇస్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ మొత్తం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ ఫైనల్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉంది. ఇంకా లేట్ అవడం ఆ పార్టీలకు మైనస్ కానుంది. 2018లో కూడా చాలా ఆలస్యంగా టికెట్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది.