పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తోందని, ఢిల్లీలో మేయర్ పదవి కోసం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదని గుర్తుంచుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయని మోడీ తెలుసుకోవాలని హితవు పలికారు. రాజు బికారి అవుతాడు, బిచ్చగాడు రాజు అవుతాడన్నారు.
విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి.. అధికారంలోకి రావాలి ఇదే బీజేపీకి తెలుసునన్నారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రభుత్వం అమ్మేస్తోందని మండిపడ్డారు. దేశంలో నీతివంతమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత్ నెంబర్ వన్ అవుతుందన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించడంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పాత్ర కూడా ఉందన్నారు. తెలంగాణ తీసుకు వచ్చిన కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని, పంజాబ్లో కూడా ఈ పథకానని ప్రారంభిస్తామన్నారు. మంచి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా ఎవరైనా అమలు చేయవచ్చునని చెప్పారు. ఖమ్మం సభకు వచ్చిన భారీ సంఖ్యలోని జనాలను చూడాలంటే తమకు పెద్ద అద్దాలు కావాలన్నారు. చివరగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు.