రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ ,తెలంగాణలో ప్రగతి గురించి వివరించనున్నారు. అమెరికా హెండర్సన్లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ వచ్చింది. మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధివిధానాలపై మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు. సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను సందర్శించారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది.