చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తలసాని (Minister Talasani) శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు (Battina brothers) పంపిణీ చేయనున్నారని ఆయన తెలిపారు. కరోనా వల్ల గత మూడేళ్లుగా చేప ప్రసాదాన్ని నిలిపివేశామని.. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందు(fish medicine)ను పంపిణీ చేస్తామన్నారు. బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తోందన్నారు. తెలంగాణ (Telangana)తోపాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి కూడా లక్షలాది మంది వస్తుంటారని చెప్పారు. సాధారణ ప్రజలకు వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చేప మందు కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్ల ఏర్పాటుతోపాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రసాదానికి అవసరమైన చేప పిల్లలను కూడా ప్రభుత్వమే మత్స్యశాఖ (Department of Fisheries) ద్వారా సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు