»A Nursing Student Died After Being Bitten By A Dog
Kothagudem : కుక్క కాటుకు నాటు వైద్యంతో నర్సింగ్ విద్యార్థిని బలి
పెద్దవాళ్ల అమాయకత్వం ఆ అమ్మాయికి శాపంగా పరిణమించింది. డాక్టర్ కావాలనుకున్న అమ్మాయి కల అర్ధంతరంగా ముగిసింది. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం. కుక్క కరిస్తే ఏమాత్రం అశ్రద్ధ వహించకండి. వెంటనే యాంటీ రేబిస్ (Anti-rabies) ఇంజెక్షన్లు తీసుకోండి. లేకుంటే తప్పదు ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా టేకులపల్లి మండలం కోటల్ల గ్రామంలో దారుణం జరిగింది. ముత్తయ్య పద్మ దంపతుల కుమార్తె శిరీష(Sirisha)ను నెల క్రితం కుక్క కరిచింది. వ్యాక్సిన్ వేయించుకోకుండా నాటు వైద్యంతో సరిపెట్టారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి శిరీష అస్వస్థతకు గురైంది. నోటి నుండి నురగలు రావడంలో ఆమెను ఇల్లెందు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. రేబిస్ సోకిందన్న డాక్టర్లు ఆమెను వెంటనే ఖమ్మం (Khammam) దవాఖానకు తీసుకుని వెళ్లమన్నారు. అక్కడ కూడా డాక్టర్లు చేతులెత్తయ్యడంతో హైదరాబాద్ (Hyderabad) తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించిందని, ఇక వైద్యం చేయలేమని డాక్టర్లు చెప్పడంతో వెనుతిరిగి వస్తుండగా దారిలోనే మృతి చెందింది శిరీష. ఒక్క ఇంజెక్షన్ శిరీష ప్రాణం నిలిపేది.
మరింత బాధించే విషయం ఏంటంటే.. శిరీష నర్సింగ్ స్టూడెంట్(Nursing student). కుక్క కరిస్తే వ్యాక్సిన్ తీసుకోమని తనే అందరికీ చెప్పాలి. కానీ తను కూడా ఆ ఊర్లో అందరికి మాదిరిగా నాటు వైద్యం తీసుకుని.. ప్రాణాలు విడిచింది. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను విస్మరిస్తే అంతే సంగతులు. కుక్క కరిస్తే వెంటనే యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు (Nursing student) చేయించుకోండి అని సూచిస్తున్నారు డాక్టర్లు. పెంపుడు కుక్క అయినా వీధి కుక్క అయినా…ఏ కుక్క కరిచినా సరే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. నమ్మకాల ముసుగులో నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.