»Big Shock For Kothagudem Brs Jalagam To Join Congress Today
Jalagam Venkatarao : కొత్తగూడెం బీఆర్ఎస్కు బిగ్ షాక్..నేడు కాంగ్రెస్లో చేరనున్న జలగం..!
మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కొత్తగూడెం (Kothagudem) నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అధికార బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడం, సీఎం కేసీఆర్ (CMKCR) అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District)లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy)లతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, బీఆర్ఎస్ (BRS) కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జలగం వెంకట్రావు 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీలో చేరిన జలగం వెంకట్రావు (Jalagam Venkatarao) తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. అధికార పార్టీలో జలగం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని జలగం నిర్ణయించుకున్నారు.తన అనుచరులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశమై చర్చించి కాంగ్రెస్ నేతలకు ఓకే చెప్పారు. కాగా, కొత్తగూడెం టికెట్ ను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ (Congress party)ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఆ టికెట్ ను జలగంకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ పెండిగ్లో పెట్టడంతో జలగం వెంకట్రావుకు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ముమ్మర ప్రచారం జరుగుతోంది.