తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఉన్న 54 కార్పొరేషన్లను(corporations) రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. దీంతో ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు పదవులు తొలిగిపోయాయి.
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఉన్న 54 కార్పొరేషన్ల(corporations) ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ పోస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో వారు ఆయా పోస్టులకు రాజీనామా చేయకుండానే వారి పదవుల నుంచి తొలగిపోనున్నారు. ఈ జాబితాలో మీడియా అకాడామీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరి శంకర్, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ సహా మొత్తం 54 కార్పొరేషన్ల పదవులను రేవంత్ రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
అయితే ఈ నిర్ణయం ఈనెల 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఆఫీసులలో పనిచేస్తున్న పీఏ, పీఎస్, ఓస్డీలు వారు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు లేదా వారి సొంత డిపార్టమెంట్లలోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు కాంట్రాక్టు, ఔట్ సౌర్సింగ్ పద్దతిలో ఎంపికైన ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్ ను కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మంది వారి పదవులకు రాజీనామా చేయగా మరికొంత మంది మాత్రం ఇంకా పదవుల్లో కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.