Tomato: టమాటా కిలో రూ.200..ప్రభుత్వ ప్రోత్సాహం లేక
టమాటా రేట్లు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో టమాటా ధర ఏకంగా కిలో రూ.200 పలుకుతుంది. ఇది తెలిసిన జనాలు వామ్మో ఇవేం రేట్లను వాపోతున్నారు.
Tomato: ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఎలా మారింది అంటే వారు రోజు కూలికి వెలితే గాని పూట గడవదు. అలాంటిది ఈ వర్షాల కారణంగా పని దొరకడం లేదు. ఇక మార్కెట్లో కూరగాయల ధరలు చూడబోతే కొండెక్కికూర్చున్నాయి. అందులో టమాటా(Tomato) అయితే ఆకాశమే హద్దు అన్నట్లు రోజుకింత దాని రేటు పైకే వెళ్తుంది. తాజాగా ఆదిలాబాద్(Adilabad) పరిసర ప్రాంతాల్లో టమాట రేటు చూస్తే ఈ మబ్బుల్లో కూడా వడదెబ్బ తగిలేలా ఉంది. సామాన్యులకు అందని ద్రాక్షగా తయారైంది. గత రెండు నెలలుగా దాన్ని పట్టుకుందామన్నా అందడం లేదు. ఇప్పుడు ఏకంగా రూ.200లకు చేరింది.
మొన్నటి వరకు కిలో రూ.100 ఉండగా, బుధవారం రైతు బజార్లో ఏకంగా రూ.200లకు చేరుకుంది. మాములుగా కిలో టమాటా కొనుగోలు చేస్తే 10 నుంచి 12 వరకు వస్తున్నాయి. ఈ లెక్కన ఒక్కో టమాటా ధర రూ.20 పలుకుతోంది. అయితే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు కూరగాయలకు ఇబ్బందులు పడడం ఏంటంటారా.. మాములుగా టమాటాను వర్షాధారంగా మాత్రమే చేస్తారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో 20 వేల ఎకరాల్లో ఈ పంట సాగయ్యేది. ఏటా నష్టాలు వస్తుండటం, కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహించకపోవడంతో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. జిల్లాలో సాగయ్యే టమాటా సెప్టెంబరు మొదటి వారంలో మార్కెట్లకు వస్తుంది. ఆ సమయంలో కిలో ధర రూ.40 లోపు ఉంటుంది. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తం టమాటా వస్తే ధర తగ్గిపోయి నష్టపోవడం జరుగుతోంది. వానాకాలం సీజన్ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు గ్రామాల నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటారు. ఈ సీజన్లో సాగు తక్కువగా ఉండటం, అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాటాకు కొరత ఏర్పడింది. ఒక్కసారిగా దేశం మొత్తంలో డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగాయి.
ఇదే సమయంలో కొంత మంది వ్యాపారులు సిండికేట్(Syndicate)గా మారి భారీ సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒక ట్రే అంటే 25 కిలోలు ఉంటుంది. దీని ధర రూ.2,500-3,000 ఉంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని టోకు వ్యాపారులు రూ.3,500-4,000 చొప్పున మార్కేట్లో అమ్ముతారు. ఈ లెక్కన కిలో ధర రూ.140 అవుతుంది. కొంత లాభం చూసుకొని విక్రయించినా కిలో రూ.160 వరకు సమంజసంగా ఉంటుంది. మార్కెట్లో కొరతగా ఉండటంతో వ్యాపారులు సిండికేట్గా మారి ట్రే ధరలను పెంచడంతో వినియోగదారునికి చేరే సరికి కిలో రూ.200 అవుతోంది. ఈ వర్షాల కారణంగా మిగితా కూరగాయలు కూడా రేటు పెరిగింది. మిర్చి రూ.160 పలుకుతుండగా.. ఇతర వెజిటేబుల్స్ రూ.100కు తగ్గడం లేవు.