Heavy Rains: హైదరాబాద్కు భారీ వర్షసూచన ఉందని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నీళ్లు నిల్వ ఉండే 141 పాయింట్ల వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి నీళ్లను వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్ర్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని తెలిపారు. అలాగే వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వచ్చే ఐదు రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోనే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్ముకొండలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.