వాహనాలు నడిపేటప్పుడు వెనుకాముందు ఒకసారి చూసుకోవాల్సిందే. మొన్ననే పార్కింగ్ ప్రదేశంలో కారు పెడుతుండగా ఓ చిన్నారి కారు కింద నలిగి చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ డ్రైవర్ (Driver) రోడ్డు మీద అకస్మాత్తుగా డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం (Two Wheeler) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ (Hyderabad)లోని ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది.
ఎల్బీనగర్ (LB Nagar) ఎన్టీఆర్ నగర్ లో హబీబుద్దీన్, శశిరేఖ దంపతులు నివసిస్తున్నారు. వారికి ధనలక్ష్మి అనే రెండేళ్ల కుమార్తె ఉంది. శశిరేఖ బ్యూటీషియన్ (Beautician)గా పని చేస్తోంది. మే 31వ తేదీన మన్సూరాబాద్ (Mansoorabad)లో పని ముగించుకుని కుమార్తెతో కలిసి భార్యాభర్తలు బైక్ పై తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కామినేని ఆస్పత్రి మార్గంలో ఓ కారు ఆగి ఉంది. ఆ కారులోని డ్రైవర్ అకస్మాత్తుగా డోర్ (Car Door) తెరిచాడు. అనూహ్యంగా ఆయన డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన హబీబుద్దీన్ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కిందపడిపోయారు.
పాప ధనలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హబీబుద్దీన్, శశిరేఖ లేచి కామినేని ఆస్పత్రిలో (Kamineni Hospital) చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. కుమార్తె మరణంతో ఆ దంపతులు తీవ్ర విషాదంలో మునిగారు. కాగా ఆ ప్రమాదం సీసీ కెమెరాలో(CC Footage) రికార్డయ్యింది. ప్రమాదం జరిగిన తీరులో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.