రాష్ట్రంలో ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు (Nominations) మొదలుకానున్నాయి. ఈ నెల 10వ తేది ఉదయం వరుకు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో నామినేషన్లను స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు (Independent candidates) నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారంతో పాటు ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ (Telangana) మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు.117 స్థానాలకు బీఆర్ఎస్ (BRS).. 100 స్థానాలకు కాంగ్రెస్.. 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి.ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి (Kamareddy) నుంచి కూడా పోటీ చేయనున్న కేసీఆర్ ఈ నెల తొమ్మిదిన రెండు చోట్లా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావులు సభలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, బూత్ స్థాయి సమావేశాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. సుమారు 60 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం చేశారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో వారు అందరూ నియోజకవర్గాలను ఒకసారి చుట్టేశారు.కాంగ్రెస్.. మిగిలిన 19 స్థానాలకు కూడా నేడో రేపో అభ్యర్థులను ప్రకటించనుంది. తమకే సీటు వస్తుందనుకొన్న నాయకులు ముందు నుంచీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంతో వారూ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. బీజేపీ (BJP) మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినందున ఈ పార్టీకి కేటాయించే స్థానాలు పోనూ మిగిలిన చోట్ల అభ్యర్థులను ప్రకటించాలి. షెడ్యూలు ప్రకటించకముందే ప్రధాని మోదీ (PMMODI) రెండు బహిరంగసభల్లో పాల్గొనగా, అమిత్ షా, కొందరు కేంద్రమంత్రులు పలు సభలకు హాజరయ్యారు.