Implement Job Calendar: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మొద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. కర్ణాటక ప్రజలను ఆ పార్టీ మోసం చేసిందని విరుచుకుపడ్డారు. ఇక్కడ అలాంటి పరిస్థితి రానీయొద్దని కోరారు. కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంట్ కావాలా..? రేవంత్ ఇచ్చే 3 గంటల విద్యుత్ కావాలా అని అడిగారు. పెద్దపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. విద్యుత్, నీళ్లు, కొలువల భర్తీ.. ఒక్కో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కేసీఆర్ను మూడో సారి సీఎం చేస్తే.. జాబ్ క్యాలెండర్ (Job Calendar) అమలు చేస్తామని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చగా మారిందని చెప్పారు. రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేశామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ భరోసా పేరుతో 15 కొత్త కార్యక్రమాలు చేపడతామని స్పష్టంచేశారు.