»Popcorn Brain Heres How Technology Affects Our Life
Popcorn Brain : ఎక్కువ సోషల్ మీడియాల్లో గడిపే వారికి ‘పాప్ కార్న్ బ్రెయిన్’!
ఈ మధ్య కాలంలో పాప్ కార్న్ బ్రెయిన్ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాల్లో కాలం గడిపే వారికి ఇలాంటి మెదడు స్థితి వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
Popcorn Brain : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు(smart phones) కనిపిస్తున్నాయి. అందుకనే రకరకాల సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారు. కొంత మంది అయితే బయట గడిపే సమయం కంటే సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయమే అధికంగా ఉంటోంది. అలాంటి వారికి పాప్ కార్న్ బ్రెయిన్ ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ పాప్ కార్న్ బ్రెయిన్ అంటే ఏంటో తెలుసుకుందాం పదండి.
మనం ఓ బాణలిలో పాప్ కార్న్ చేసుకోవడానికి గింజల్ని వేసి మంట మీద పెట్టామననుకోండి. అవి టప్ టప్మని శబ్దం వస్తూ ఎగిరి పడుతుంటాయి. అచ్చంగా అలాగే ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో గడిపే వారి మెదడు కూడా ప్రవర్తిస్తుందట. పాప్ కార్న్(Popcorn) మాదిరిగా నిశ్చలత లేని ఆలోచనలతో వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందట. అంటే వారు చంచలంగా మారిపోతారని చెప్పడానికి ఈ పదాన్ని ఇటీవల కాలంలో వాడుతున్నారు.
ఇలా చంచలమైన ఆలోచనలతో మన మెదడు పాప్‌కార్న్ బ్రెయిన్‌గా(Popcorn Brain) మారిపోతే పలు రకాల మానసిక సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చేసే పనిపై ఏకాగ్రత తగ్గిపోతుందట. ఆలోచనా తీరులో ఊహించని మార్పులు చోటు చేసుకుని అవి వారి జీవన విధానంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయట. ఇంకా ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువై మానసిక సమస్యలు చుట్టుముడతాయట. దీంతో చికాకు, గందరగోళం లాంటివి మనిషిలో పెరిగిపోతాయట. జ్ఞాపక శక్తీ తగ్గిపోయి సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడతారట. అందుకనే వీలైనంత తక్కువ సేపు సోషల్ మీడియాల్లో గడపడం మంచిదని వారు సూచిస్తున్నారు.