Creta N Line : మార్కెట్లోకి విడుదలైన క్రెటా ఎన్ లైన్ మోడళ్లు
ప్రస్తుతం మిడ్ రేంజ్ కార్ మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తున్న హ్యుండాయ్ క్రెటాలో ఇప్పుడు ఎన్ లైన్ మోడళ్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. వీటి ధర ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Hyundai Creta N Line : మిడ్ రేంజ్ ఎస్యూవీ కార్ల అమ్మకాల్లో క్రెటా అగ్ర స్థానంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుండాయ్ నుంచి క్రెటా ఎన్లైన్(Creta N Line) మోడళ్లు ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఎక్స్ షోరూంలో వీటి ప్రారంభ ధర రూ.16.82 లక్షలు మొదలుగొని ఉంటుంది. దీనిలో ఎన్8, ఎన్10 అని రెండు వేరియంట్లను సంస్థ విడుదల చేసింది.
క్రెటా ఎన్లైన్ ఎన్8, ఎన్10లకు సంబంధించిన బుకింగ్లను సంస్థ ఇప్పటికే స్వీకరిస్తూ ఉంది. రూ.25 వేలు కట్టి ఈ కార్లను మనం బుక్ చేసుకోవచ్చు. ఎ8 మాన్యువల్ ధర రూ.16,82,300గా ఉంది. అలాగే ఎన్8 డీసీటీ ధర 18,32,300గా ఉంది. ఎన్10 మాన్యువల్ ధర రూ.19,34,300గా ఉండగా ఎన్10 డీసీటీ ధర రూ.20,29,900గా ఉంది. ఇక లుక్ విషయంలో, ఫీచర్ల విషయంలో వీటికి, సాధారణ క్రెటాకి(Creta) మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని సంస్థ చెబుతోంది.
స్టీరింగ్ వీల్, గేర్ లివర్, అలోయ్ వీల్స్, ఇంజన్ తదితరాల విషయంలో చాలా మార్పులు ఉన్నాయని సంస్థ చెబుతోంది. అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే మ్యాట్, థండర్ బ్లూ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, షాడో గ్రే విత్ అబిస్ బ్లాక్ రూఫ్ వంటి రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. వీటిని ఎంచుకునేప్పుడు మోనోటోన్ లేదా డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లను తీసుకోవచ్చని తెలిపింది.