Haryana Politics : హర్యానా సీఎం పదవికి లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానాలో రాజకీయలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు.
Haryana Politics News : హర్యాణా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్ భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎంతో పాటుగా ఆయన మంత్రి వర్గంలో ఉన్న అందరూ రాజీనామాలు చేసినట్లు బీజేపీ నేత కన్వర్ పాల్ గుజ్జర్ తెలిపారు. గవర్నర్ వారి రాజీనామాలకు ఆమోదం తెలపడంతో ఇక వారి రాజీనామాలన్నీ నిశ్చయమైనట్లే.
బీజేపీ-జననాయక్ జనతా పార్టీ(JJP) ప్రభుత్వంలో చీలికలు ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పది మంది ఎమ్మెల్యేల మద్దతును ఇస్తున్న జేజేపీతో బీజేపీకి విభేదాలు రావడంతో ఈ రాజీనామాలు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త నేత ఎవరనే విషయంలో ఇంకా స్పష్టమైన వార్తలు వెలువడలేదు. ఈ రేసులో నయబ్ సైనీ ఉన్నట్లు సమాచారం.
90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో(Haryana) బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారు. హరియాణ లోక్‌హిత్ పార్టీ(HLP)కి చెందిన ఒకఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీతో విభేదాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై జేజేపీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రభుత్వం ఇచ్చిన కాన్వాయ్‌ను తిప్పి పంపినట్లు సమాచారం. ఆ పార్టీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వస్తే తప్ప ఈ రాజకీయ వ్యవహారాల్లో స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.