Byju’s : నిధుల కొరతతో ఆఫీసులు ఖాళీ చేస్తున్న బైజూస్
ప్రముఖ ఎడ్యు టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్ని క్రమంగా ఖాళీ చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Byju’s vacates all offices : ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌కు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఈ నెల ఉద్యోగులకు వేతనాలు కూడా సరిగ్గా చెల్లించలేకపోయింది. దీంతో అద్దెల భారం తగ్గించుకునే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలను(offices) వరుసగా ఖాళీ చేస్తూ వస్తోంది. అయిపోయిన రెంటల్ అగ్రిమెంట్లను వేటినీ పునరుద్ధరించుకోవడం లేదు. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా సూచిస్తోంది.
బైజూస్(Byju’s) సంస్థ ప్రధాన కార్యాలయం(HQ) బెంగళూరులో ఉంది. అక్కడ మాత్రమే ఆఫీసు నుంచి పని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మిగిలిన ఆఫీసులన్నీ వరుసగా ఖాళీ చేస్తూ వస్తున్నారు. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే తాము ఈ పని చేస్తున్నట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం కేటాయించిన ట్యూషన్ సెంటర్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా బైజూస్ సంస్థ తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. దాదాపుగా 1.2 మిలియన్ డాలర్ల లోన్ల విషయంలో న్యాయ పరమైన చిక్కులనూ ఎదుర్కొంటోంది. కంపెనీ ఆర్థికంగా దిగజారుతుండటంతో పలువురు ఇన్వెస్టర్లు తమ వాటాలను ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థలో పని చేస్తున్న దాదాపు 15 వేల మంది ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేయాల్సిందిగా సంస్థ కోరుతోంది.