క్రికెట్ లో మహిళలకు విశేష ప్రాధాన్యం కల్పించేందుకు బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించనుంది. ఐపీఎల్ మాదిరి మహిళల కోసం నిర్వహిస్తున్న లీగ్ కు బీసీసీఐ ‘మహిళల ప్రీమియర్ లీగ్’ (Women’s Premier League-WPL) అనే పేరును ఖరారు చేసింది. ఈ లీగ్ లో ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలంతో బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. ఐపీఎల్ కు మించిన దానికన్నా అధిక ఆదాయం లభించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. డబ్ల్యూపీఎల్ లీగ్ వివరాలన్నింటిని బుధవారం షా వెల్లడించారు.
ఈ లీగ్ లో ఐదు జట్ల కోసం వేలం నిర్వహించారు. ఐదు జట్ల ద్వారా బీసీసీఐకి రూ.4,670 కోట్ల ఆదాయం లభించింది. 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే డబ్ల్యూపీఎల్ కు వచ్చిన మొత్తం ఎక్కువని జై షా వివరించారు. డబ్ల్యూపీఎల్ మహిళల క్రికెట్ లో విప్లవానికి నాంది పలుకుతుందని తెలిపారు. మహిళల క్రికెట్ లో అనేక సంస్కరణలు తీసుకువస్తుందని జై షా పేర్కొన్నారు. అయితే వేలం ద్వారా ఐదు జట్లను ఐదు ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి.
ఫ్రాంచైజీల వివరాలు
జట్టు దక్కించుకున్న సంస్థ విలువ
అహ్మదాబాద్ అదానీ స్పోర్ట్స్ లైన్ రూ.1,289 కోట్లు
ముంబై ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.913 కోట్లు
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901 కోట్లు
ఢిల్లీ జేఎస్ డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లు
లక్నో కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757 కోట్లు