కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అమిత్ షా… తన కుమారుడికి అత్యున్నమైన పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించననున్నాడని వార్తలు ఊపందుకున్నాయి.
బీసీసీఐ రాజ్యంగ సవరణకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం అనుమతి ఇవ్వడంతో జై షా, గంగూలీలు తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగుమమైంది. రాష్ట్ర సంఘం, బీసీసీఐలో ఆరేళ్ల చొప్పున ఓ ఆఫీస్ బేరర్ నిరంతరాయంగా 12 ఏళ్లు పదవిలో కొనసాగవచ్చని, ఆ తర్వాతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధన వర్తిస్తుందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది.
దాంతో జై షా, గంగూలీ తిరిగి ఎన్నికల్లో పోటీపడి 2025 వరకు పాలకులుగా ఉండేందుకు వారు అర్హత సాధించారు. ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈ అక్టోబర్‌తో ముగియనుంది. అక్టోబర్ తర్వాత బీసీసీఐలో మళ్లీ ఎన్నికలు నిర్వహించి జై షా ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు కూడా జై షా అధ్యక్షున్నిచేసేందుకు సిద్ధమైనట్టు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా పత్రిక పేర్కొంది. జై షాను బీసీసీఐ అధ్యక్షుడిని చేసేందుకు సుమారు 15 రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపింది.