క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్కి అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Sunrisers Hyderabad: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మ్యాచ్ ప్రారంభంకానున్న వేళ సన్‌రైజర్స్ నూతన సారధిని నియమించనుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్ స్టార్ ప్యాట్ కమ్మిన్స్‌కు తమ సన్‌రైజర్స్ పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్ మార్క్రమ్ను తప్పించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా పునఃవైభవానికి కమిన్స్ నాంది పలికాడు. 2022లో టెస్టు సారథిగా ఎంపికైన అతడు ఆస్ట్రేలియా జట్టుకు నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందించాడు. మార్క్రమ్ సైతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండు సార్లు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.