రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టికరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
IPL 2024: రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టికరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ కూడా త్వరగానే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 8 వ ఓవర్లో మరో ఓపెనర్ జాస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. టాపార్డర్‌లో ఉన్న ముగ్గురు బ్యాటర్లు కూడా 36 పరుగులకే పెవిలియన్ చేరారు. రాజస్థాన్ జట్టు పీకల్లోను కష్టాల్లో పడింది. సరిగ్గా ఆ సమయంలో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ జట్టును ఆదుకున్నాడు. పరుగుల వరద పారించాడు. స్కోర్ వేగాన్ని పెంచాడు.
అప్పటికే బరిలో ఉన్న రియాన్ పరాగ్ కూడా జోరు పెంచాడు. అశ్విన్ దూకుడుతో స్పూర్తి పొందిన రియాన్ పరాగ్ .. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లో 29 పరుగులు చేసిన అశ్విన్ 13వ ఓవర్లో ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టబ్స్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ధృవ్ జురెల్ కూడా చెలరేగి ఆడాడు. మూడు ఫోర్లు బాది పరుగుల వేగాన్ని పెంచాడు. మరో పక్క రియాన్ పరాగ్ మాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా దాడి కొనసాగించాడు. ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఢిల్లీ బౌలర్ నోకియా వేసిన ఆ ఓవర్ ..రాజస్థాన్ జట్టుకు ఎంతో కలిసి వచ్చింది. జట్టు స్కోర్ 185 పరుగులకు చేరింది. రియాన్ పరాగ్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొదటి 10 ఓవర్లలో కేవలం 50 పరుగులు చేసిన రాజస్థాన్ జట్టు తర్వాత 10 ఓవర్లలో 135 పరుగులు పిండుకుంది.
186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శుభారంభం అందించారు. డేవిడ్ వార్నర్ 49 పరుగులు, మిచెల్ మార్ష్ 23 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ రిషబ్ పంత్ వన్డే మ్యాచ్ ఆడినట్లు ఆడాడు. 26 బంతుల్లో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్ స్టబ్స్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఢిల్లీ జట్టుకు విజయంపై ఆశలు కల్పించాడు. 17 ఓవర్లలో 19 పరుగులు, 18 ఓవర్లో 9 పరుగులు సాధించిన ఢిల్లీ బ్యాటర్లు 19వ ఓవర్లో 15 పరుగులు చేశారు. 17వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ 19వ ఓవర్ వేసిన సందీప్ శర్మలు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మిడిలార్డర్ బ్యాటర్ స్టబ్స్ వీరిపై దారుణంగా విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సులు బాది జట్టు స్కోర్‌ను అమాంతంగా పెంచాడు.
విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం అయ్యాయి. అక్షర్ పటేల్, స్టబ్స్ బరిలో ఉన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆవేశ్ ఖాన్ వేసిన యార్కర్లను..ఢిల్లీ బ్యాటర్లు ఆడలేకపోయారు. అప్పటి వరకు భీకరంగా ఆడిన స్టబ్స్ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆవేశ్ ఖాన్ చివరి ఓవర్లో కేవలం కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటర్లు కనీసం ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారు. చివరి ఓవర్లో చేతులెత్తేశారు. పరాజయం పాలయ్యారు.