»Great Victory For India New Zealand Lost The Fight
IND vs NZ: ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం..పోరాడి ఓడిన న్యూజిలాండ్
వరల్డ్ కప్ సెమీస్‌లో నేడు భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ 7 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. కివీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్ ఫైనల్స్‌కు చేరింది.
నేడు జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. 70 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 117 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 105 పరుగులు చేయగా శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతులకు 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 39 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు చేసి పెవిలియన్ దారి పట్టాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 3 వికెట్లను పడగొట్టగా మరో బౌలర్ బౌల్డ్ ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత బరిలోకి దిగిన కివీస్ భారీ టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్ 119 బంతులకు 134 పరుగులు చేశాడు. మిచెల్ ఒంటరి పోరాటం ఫలించలేదు. మరో బ్యాటర్ పిలిఫ్స్ 33 బంతులకు 41 పరుగు చేయగా రచిన్ రవీంద్ర, డెవొన్ కాన్వే 13 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో షమీ 7 వికెట్లతో విజృంభించాడు. కివీస్ బ్యాటర్లను కట్టడి చేస్తూ ఫామ్‌లో నిలిచాడు. దీంతో అప్పటి వరకూ భారీ స్కోర్ చేసిన కివీస్ బ్యాటర్ మిచెల్ కూడా షమీ ఓవర్లలోనే వెనుతిరిగాడు. మహ్మద్ షమీ 7 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టి న్యూజిలాండ్ స్కోరును కట్టడి చేయగలిగారు. ఈ మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మహ్మద్ షమీ రికార్డుకెక్కాడు.
మరో బౌలర్ మహ్మద్ సిరాజ్ 1 వికెట్ పడగొట్టాడు. చివరి రెండు ఓవర్లు ఉత్కంఠగా సాగాయి. 48.2 బంతికి మహ్మద్ షమీ మరో వికెట్ తీయగా 9 వికెట్ల నష్టానికి కివీస్ స్కోరు 321కి చేరింది. ఆ తర్వాత అదే ఓవర్లలోనే 5వ బంతికి షమీ మరో వికెట్ తీయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది.