అందరూ అనుకున్నట్లు జరిగింది. పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బాబర్ ఆజమ్ (Babar Azam) ప్రకటించాడు. తాను టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ (ODI World Cup 2023)లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ బాబర్ ఆజమ్ చేసిన పోస్ట్:
విమర్శల నేపథ్యంలో తాను అన్ని ఫార్మాట్లలో సారథ్యానికి గుడ్ బై చెబుతున్నట్లు బాబర్ ఆజమ్ (Babar Azam) స్పష్టం చేశాడు. సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజమ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే తాను ఆటగాడిగా పాక్ జట్టులో కొనసాగుతానని తెలిపాడు. ఈ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో లీగ్ దశలో పాకిస్థాన్ 9 మ్యాచులు ఆడింది. కానీ అందులో నాలుగు మాత్రమే గెలిచింది. దీంతో సెమీస్‌కు ఆ జట్టు అర్హత సాధించలేకపోయింది.
పాక్ జట్టుకు 8 పాయింట్లు మాత్రమే వచ్చాయి. టోర్నీ నుంచి నిష్క్రమించిన తరుణంలో పాక్ కెప్టెన్ (Pakistan Captain) బాబర్ ఆజమ్‌పై పలువురు విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు సైతం బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాక్ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని, అందుకే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని బాబర్ ఆజమ్ ప్రకటించాడు.