»Election Code Effect Cancellation Of Indian Racing League To Be Held In Hyderabad
Hyderabad: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయ్యింది. ఈ రేస్‌ను చెన్నైకి మారుస్తున్నట్లుగా రేసింగ్ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు.
తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయ్యింది. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) పోటీలు తొలిసారి హైదరాబాద్ హుసేస్ సాగర్ తీర ప్రాంతంలో జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారంగా నవంబర్ 4, 5వ తేదీల్లో ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి పోటీలు నిర్వహించాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రేసింగ్ లీగ్‌కు పోలీస్ భద్రతా ఏర్పాట్లలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల దృష్ట్యా పోలీసులు గట్టి భద్రత, నిఘా నడుమ అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అందువల్ల రేసింగ్ లీగ్‌కు పోలీసుల కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది. భద్రతా ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడనుంది.
ఈ తరుణంలో రేసింగ్ లీగ్‌ను హైదరాబాద్ నుంచి చెన్నైకి మారుస్తున్నట్లు ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ రేసింగ్ లీక్ కోసం ఇప్పటికే చాలా మంది టికెట్లను కొనుగోలు చేసి ఉన్నారు. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు త్వరలోనే డబ్బులు రీఫండ్ చేస్తామని నిర్వాహకకులు ప్రకటించారు. డిసెంబర్ 10వ తేది వరకూ నాలుగు విడతలుగా ఫార్ములా-4 రేసింగ్ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.