2019లో వివిధ కారణాలతో ఓటమి నేపథ్యంలో 2024లో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారా? 1999 నాటి ప్రయోగాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? పాతిక సంవత్సరాల క్రితం నాటి స్ట్రాటెజీతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే పాతతరం నాయకులకు, రెండు లేదా అంతకుమించిసార్లు ఓడిపోయిన
నేతలకు, ప్రజల్లో మమేకం కాని వారికి ఎలాంటి మొహమాటం లేకుండా టిక్కెట్ నిరాకరించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఓట్లు, సీట్లు ప్రాతిపదికగా జరిగే ఎన్నికల్లో మొహమాటం ఉంటే నెగ్గడం కష్టం. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ తనతో కలిసి పని చేశారని, సీనియర్లు అనే కారణంతో కొన్నిసార్లు మొహమాటానికి వెళ్లి చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ 2024లో మాత్రం అందుకు సిద్ధంగా లేరట.
సాధారణంగా ఏ పార్టీని చూసినా కొత్త తరానికి ప్రాధాన్యత కనిపిస్తోంది. తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన రావు వంటి నేతలు వచ్చాక ఆ పార్టీ పుంజుకున్నది. కేటీఆర్ వంటి యువనేతలకు బీఆర్ఎస్ పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్‌ను చూసినా, రేవంత్ రెడ్డి వంటి దూకుడైన నేత రావడంతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపించింది. ఏపీలో చూసినా అదే కనిపిస్తోంది. ఏపీ బీజేపీలో దూకుడు లేకపోవడానికి సరైన కొత్త తరం లేకపోవడమేననే వాదనలు ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చెప్పవలసిన అవసరం లేదు. జగన్ అయితే స్వయంగా అధికార పార్టీ నేత కొత్త తరం నాయకుడు. ఆయా పార్టీలలోను ఎక్కువమంది యువ నాయకులు, కొత్త తరానికి ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు.
టీడీపీలోను నారా లోకేష్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వంగవీటి రాధా వంటి దూకుడైన, కొత్తరం నాయకులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పాతతరానికి చెల్లుచీటి ఇచ్చి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీలో గుసగుస వినిపిస్తోంది. 1999లో ఇలాంటి ప్రయోగమే చేశారు చంద్రబాబు. ఇప్పుడు అదే ప్లాన్‌తో ముందుకెళ్లినప్పటికీ, ప్రజల్లో పలుకుబడి, గెలవగలిగే అతికొత్తిమంది సెలెక్టెడ్ సీనియర్ నేతలకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారట. ప్రజల్లో పలుకుబడి ఉండి, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉన్న కొత్తతరం వారికి ఎక్కువగా టిక్కెట్లు ఇవ్వాలని అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది. అవసరమైతే కొన్ని సీట్లలో పలుకుబడిన కలిగిన కొత్త వారికి కూడా టిక్కెట్ ఇవ్వవచ్చునని చెబుతున్నారు. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ, ప్రజాసేవ పట్ల ఇష్టం కలిగిన ఎన్నారైలను కూడా తీసుకు వచ్చేందుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారట.
విభజన తర్వాత 2014లో పార్టీ గెలిచినప్పటికీ, ఆ టర్మ్ పని చేయని పలువురు సీనియర్లకు 2019లో మొహమాటం కొద్ది టిక్కెట్ ఇవ్వడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ తగిలిందని, అందుకే ఈసారి ప్రజల్లో లేని, ప్రజాభిమానం లేని సీనియర్లను పక్కన పెట్టేందుకు చంద్రబాబు ఏమాత్రం సందేహించేది లేదట. వరుసగా రెండు, మూడుసార్లు ఓడిపోయిన వారిని పక్కన పెట్టవచ్చునని అంటున్నారు. అయితే పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న టిక్కెట్ నిరాకరణకు గురయ్యే సీనియర్లను అసంతృప్తికి గురి చేయకుండా, పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్, ఇతర పదవులతో భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.