Lok sabha Elections: ఎన్నికల బరిలో మాజీ ముఖ్యమంత్రుల కుమారులు వీరే!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు హడావిడి కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఆరుగురు అభ్యర్ధులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం విశేషం.
Lok sabha Elections: ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఆరుగురు అభ్యర్ధులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం విశేషం. ఏపీలో అసెంబ్లీకి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్ధులు ఎవరికీ లేని ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆ ఆరుగురు అభ్యర్ధులు కూడా మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడమే విశేషం. సీఎం జగన్..మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటిది. 1978 నుంచి 2009 వరకు అదే స్థానం నుంచి రాజశేఖర రెడ్డి గెలుస్తూ వచ్చారు. తాజాగా సీఎం జగన్ కూడా అదే స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న నారా లోకేశ్ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి ఓటమి పాలైన లోకేశ్ ..ఈ సారి మరింత పట్టుదలతో అదే స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. లోకేశ్‌కు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లావణ్య బరిలో నిలిచారు. హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న నందమూరి బాలకృష్ణ కూడా మాజీ సీఎం కుమారుడే. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ గత పదేళ్లుగా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు. 2014, 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఈ సారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ నాదేండ్ల మనోహర్, కూడా మాజీ ముఖ్యమంత్రి తనయుడు కావడం విశేషం. నాదేండ్ల మనోహర్ తండ్రి నాదేండ్ల భాస్కరరావు ..గతంలో తెలుగు రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. 1985లో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావును గద్దె దించి తాను సీఎంగా పదవిని అధిష్టించారు. భాస్కరరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన మనోహర్ … మొదట్లో తన తండ్రిలాగే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీలక పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత నేదురు మల్లి జనార్ధన్ రెడ్డి ..కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అదే విధంగా మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి తనయుడు సూర్య ప్రకాశ్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.