»Hardeep Singh Nijjars Murder Bad Relations Between India And Canada
Hardeep Singh Nijjar హత్య చిచ్చు..? ఇండియా- కెనడా మధ్య చెడిన సంబంధాలు
ఇండియా- కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్‌పై కెనడా ప్రధాని ట్రుడో కోపంతో రగిలిపోతున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు నిజ్జర్ హత్య, అందులో భారత్ పాత్ర గురించిన సాక్ష్యాలను అందజేసే అవకాశం ఉంది.
Hardeep Singh Nijjar's murder? Bad relations between India and Canada
Hardeep Singh Nijjar: ఇండియా-కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యతో మొదలైన గొడవ పీక్‌కి చేరింది. కెనడా పార్లమెంట్లో ప్రధాని ట్రుడో ప్రకటన.. తర్వాత ఇండియా రియాక్షన్‌తో ఇరుదేశాల మధ్య పచ్చ గడి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. కెనడాలో ఇండియా దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన చేయడంతో.. భారత్ కూడా ధీటుగా స్పందించింది. కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీచేసింది. 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని స్పష్టంచేసింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు..? ఆయన హత్యపై కెనడా ఎందుకు అంత సీరియస్‌గా స్పందించింది..?
నిజ్జర్ హత్య
కెనడాలో ఆ దేశ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య..? అతనిని భారత ఏజెంట్లు హతమార్చారని ట్రుడో అంటున్నారు. ఆ దేశ పార్లమెంట్‌ను సమావేశం పరచి మరీ ప్రకటన చేశారు. ఇష్యూ ఉంటే.. మాట్లాడి పరిష్కరించుకుంటే ఓకే.. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. భారతదేశంపై విషం కక్కాడు. జీ20 సమావేశాలు ముగిసిన తర్వాత.. ఇండియా నుంచి వెళ్లిన తర్వాత మాట్లాడారు. ఇంకేముంది ఇండియా కూడా అదే రేంజ్లో ఫైరయ్యింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. నిజ్జర్ ఎవరు..? అతని నేపథ్యాన్ని ఓ సారి పరిశీలిస్తే.. కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది. భారతదేశం నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని వేరుచేసి మరో దేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. 1990 చివరలో కెనడా వెళ్లాడు.. అక్కడ యువకులకు శిక్షణ ఇచ్చి, రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్, దాని చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూతో నిజ్జర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండానికి పిలుపునిచ్చింది.
వాంటెడ్ లిస్ట్
పంజాబ్ సీఎంగా ఉన్న సమయంలో అమరీందర్ సింగ్.. కెనడా ప్రధానికి నిజ్జర్తోపాటు మరికొందరు వాంటెడ్ వ్యక్తుల లిస్ట్ అందజేశారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. అతడిని అప్పగించాలని కోరారు. కెనడా స్పందించలేదు. 2007లో లుథియానాలో జరిగిన పేలుళ్లలో నిజ్జర్ పాత్ర ఉంది. ఆ ఘటనలో ఆరుగురు చనిపోగా 42 మంది గాయపడ్డారు. 2010లో పాటియాలాలో ఓ ఆలయంలో దాడికి పాల్పడ్డారు. 2015లో హిందూ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడికి ప్లాన్ చేశాడు. 2015, 2016లో నిజ్జర్‌పై లుక్ ఔట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కెనడా అప్పగించలేదు. 2018లో పంజాబ్‌లో ఆర్ఎస్ఎస్ నేతల హత్యలో నిజ్జర్ హస్తం ఉంది. 2022లో జలంధర్‌లో హిందూ పూజారి హత్యకు కుట్ర చేశాడు. అప్పుడు ఎన్ఐఏ నిజ్జర్‌పై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించింది. 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించి.. తమకు అప్పగించాలని కెనడాను పదే పదే కోరింది. అయినప్పటికీ ఆ దేశం స్పందించలేదు. ఈ జూన్ 18వ తేదీన సర్రే నగరంలో నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పుడే పాకిస్థాన్, యూకేలో ఉన్న ఖలిస్తానీ నేతలు కూడా హత్యకు గురయ్యారు. ఈ హత్యల వెనక భారత గూఢచార సంస్థ రా ఉందని ఖలిస్తానీ నేతలు కామెంట్ చేశారు. దానిని కెనడా ప్రధాని నమ్మి.. పార్లమెంట్లో కామెంట్స్ చేశారు. ఇరుదేశాల దౌత్యవేత్తలను బహిష్కరించే వరకు ఇష్యూ వెళ్లింది.
ఆ 4 దేశాల సాయం
భారత్‌తో ఇష్యూ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సాయాన్ని కెనడా ప్రధాని ట్రుడో కోరారు. భారత్ ఏజెంట్లను పంపించి, తమ పౌరుడిని హత్య చేసిందని చెబుతోంది. కెనడాతో గొడవ భారతదేశానికే నష్టం.. ఎలా అంటే అక్కడ 16 లక్షల మంది భారతీయ మూలాలు కలిగిన వారు ఉన్నారు. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ నుంచి 2.3 లక్షల మంది ఉన్నారు. సో.. ఇంతమంది ఉండగా.. విద్య, ఉద్యోగం విషయంలో సమస్య వచ్చే అవకాశం ఉంది. కెనడా నుంచి 30 శాతం పప్పు భారతదేశానికి దిగుమతి అవుతుంది. ఇండియాలో 55 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కెనడీయన్ పెన్షన్ ఫండ్స్ పేరుతో పెట్టుబడి పెట్టారు. నిజ్జర్ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు ఇచ్చేలా ఉంది. నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర బయటపడితే అంతర్జాతీయ సమాజంలో ఇబ్బందులు తప్పేలా లేవు.
బీ అలర్ట్
కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉండే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం కెనడా వెళ్లాలనుకునే వారు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించింది. కెనడాలో భారతీయులు, భారతీయ సంస్థలపై దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కెనడాలో సిక్కులు కూడా ఎక్కువగా ఉంటారు. సో.. ఇండియన్స్ అలర్ట్‌గా ఉండటం మంచిది. ఇదే విషయాన్ని విదేశాంగ ప్రతినిధులు చెబుతున్నారు.