సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాత మార్చేందుకు ‘యువగళం’ పేరిట లోకేశ్ 400 రోజులు 4000 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నాడు. ఈనెల 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభించేందుకు లోకేశ్ బుధవారం హైదరాబాద్ ను వీడారు. మళ్లీ 400 రోజుల తర్వాత హైదరాబాద్ లోకి అడుగుపెట్టనున్నాడు. అందుకే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు లోకేశ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసంలో ఉద్విగ్న వాతావరణం అలుముకుంది.
లోకేశ్ కు తల్లిదండ్రులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామ నందమూరి వసుంధర, బాలకృష్ణ ఆశీర్వదించారు. అనంతరం భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్ది హారతినిచ్చి భర్తను సాగనంపింది. కుమారుడు దేవాన్ష్ కౌగిలింతతో తండ్రి లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. మామ బాలకృష్ణ దగ్గరుండి అల్లుడిని సాగనంపారు. భారీ కాన్వాయ్ తో పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి లోకేశ్ ట్యాంక్ బండ్ పైన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించాడు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని కడప వెళ్లనున్నాడు.
కడపలోని పలు ఆలయాలు, దర్గా, చర్చిల్లో లోకేశ్ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయనున్నాడు. అనంతరం గురువారం తిరుమల చేరుకుని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నాడు. శుక్రవారం యువగళం పేరిట చేపడుతున్న పాదయాత్రకు లోకేశ్ శంఖారావం పూరించనున్నాడు. ఈ యాత్రను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీని నట్టేటా ముంచుతున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే లోకేశ్ పాదయాత్రతో అడుగడుగునా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ.. పార్టీకి ఆదరణ తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ నిర్దేశించుకుంది. పాదయాత్ర విజయవంతమైతే వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఆశల్లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.