Cm Revanth Reddy: ప్రతి రోజు 18 గంటలు పనిచేయాల్సిందే!
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై సీఎం రేవంత్ చర్చించారు. వీటిలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరికైనా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఇష్టం లేకపోతే, ఎక్కువ పనిచేయాలని లేకపోతే నిరభ్యంతరంగా చెప్తే.. వాళ్లను బదిలీ చేస్తామని తెలిపారు. 6 గ్యారెంటీల అమలు బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులదేనని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం అమలుపై నిన్న సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెవెన్యూశాఖ గ్రామ సభలను నిర్వహిస్తుందని, పోలీసు శాఖ వీటిని పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజాపాలన కోసం నియోజవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని తెలిపారు. ప్రతి అధికారి రోజు రెండు గ్రామాలకు వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ముందుగానే ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం సభ నిర్వహించాలని, అలాగే మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.