»Centre Govt Plans To New Population Census After Lok Sabha Elections Economic Data Improvements
Census : ఇప్పట్లో జనగణన లేదు.. ఎప్పుడు లెక్కిస్తారంటే ?
గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Census : గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ మీడియా కథనం వెల్లడించింది. ఇందుకోసం దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాదాపు 12 నెలల పాటు ఈ సర్వే కొనసాగుతుందని తెలుస్తోంది. దేశంలో మొదటి జనాభా గణన 1881లో నిర్వహించబడింది. అప్పటి నుండి ప్రతి దశాబ్దం ప్రారంభంలో ఇది కొనసాగుతోంది.
జనాభా లెక్కల చట్టం ప్రకారం జరిగే ఈ ప్రక్రియ పదేళ్లలో దేశ జనాభా ఎంత పెరిగిందో తెలియజేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఇదే ఆధారం. ఇది చివరిసారిగా 2011లో జరిగింది. జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
2011 నాటి లెక్కల ప్రకారం రేషన్ కార్డుల జారీ వల్ల కనీసం పది కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల తర్వాత జనాభా లెక్కల సేకరణకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల మధ్యంతర బడ్జెట్లోనూ ఈ కార్యక్రమానికి కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉండగా.. ఈసారి కులాల వారీగా జనాభాను లెక్కించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది.