తెలుగు నేలపై జన్మించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఒక్కో నేతది ఒక్కో స్టైల్ పాలిటిక్స్. ఒకరు ప్రధాని పదవీ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కాగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన నేత మరొకరు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆ ముగ్గురు పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ముగ్గురిది జాతీయ స్థాయిలో కీలకపాత్ర
పీవీ నరసింహా రావు.. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహరావు. దక్షిణాది అంటే ఉన్న చిన్నచూపును తొలగించారు. తెలంగాణ వాడిగా తన సత్తా చాటారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు నడిపించారు. పీవీ గొప్ప రాజకీయ వేత్త, అంతకుమించి ఆర్థికవేత్త. ఆయన కన్నా ముందు ప్రధాని మంత్రి పదవీ చేపట్టిన వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి చెందిన వ్యక్తి పీవీ నరసింహా రావు ప్రధానమంత్రి అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోయినా ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. తెలుగు వారి పాలన తీరును దేశానికి చాటారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశమంతా పీవీని కొనియాడుతుంది. రూపాయి విలువ పడిపోకుండా పీవీ నరసింహా రావు విశేష కృషి చేశారు.
ఆత్మగౌరవమే పునాదిగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయనది కీలక పాత్ర. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసే పనిని చేపట్టారు. నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, కన్వీనర్‌గా పనిచేశారు. దేశంలో ప్రముఖ నాయకులను హైదరాబాద్ వచ్చేలా చేశారు. వీపీ సింగ్, చంద్రశేఖర్ సహా వామపక్షాల నేతలను ఒకే తాటి పైకి తీసుకువచ్చారు. నేషనల్ పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేశారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో అర్ధాంతరంగా కన్నుమూశారు.
పోరాటం ద్వారా దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చూపారు కేసీఆర్. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీని ఏర్పాటు చేసి, కేంద్రంలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సానుకూలంగా ఒప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. జాతీయ రాజకీయాల్లో ఇలాంటి నేత ఉంటే దేశం మొత్తం బాగుపడుతుందని పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేసీఆర్ ప్రయత్నాలకు కమ్యూనిస్టులు, ఆప్, ఎస్పీ, జేడీఎస్, ఆర్జేడీ మద్దతు తెలిపాయి. దేశంలో రైతు సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు సపోర్ట్‌గా ఉంటామని ప్రకటించాయి.