MLA Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య వివాదంతో మీడియాలో ఇటీవల హాట్ టాపిక్ గా మారారు. అంతకుముందు నుంచే ‘గుడ్ మార్నింగ్’ అంటూ కేతిరెడ్డి నిత్యం జనం మధ్య తిరుగుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటాయి. ధర్మవరం పట్టణం శివానగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ మహిళతో ఆయన సంభాషణ సందర్భంలో ఆమె ఎమ్మెల్యే కి కౌంటర్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ.. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి మహిళలకు సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వివరించారు. జగన్ పాలన ఎలా ఉంది? అంటూ అడిగారు. ఈ సమయంలో ఓ మహిళ మద్యం ధరలు తగ్గించాలి సార్ అని ఎమ్మెల్యేను కోరింది. “నీ భర్త తాగకుండా ఉండాలా.. లేక ధరలు తగ్గించాలా?” అని ఎమ్మెల్యే ఆ మహిళను ప్రశ్నించారు. ‘తాగకపోతే మంచిదే సార్…కానీ ధరలు కూడా తగ్గించాలి’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి తెచ్చింది. తాగి వచ్చినప్పుడు నీ భర్తకు అన్నం పెట్టవద్దు.. అని ఎమ్మెల్యే చెప్పగానే.. ‘పనిచేసే వారికి భోజనం పెట్టకపోతే ఎట్లా సార్?’ అంటూఎదురు సమాధానం ఇచ్చిందా మహిళ. ఎమ్మెల్యే కు మహిళకు మధ్య రెండు రోజుల క్రితం జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.