Tenth Paper leak: పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్లు జిల్లాలోని కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీక్ అయి వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంలోనే బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేయ్యారు. ఈ ఘటనలో డిబార్ అయిన హరీష్ అనే విద్యార్ధికి హైకోర్టులో ఊరట లభించింది.
హరీశ్ వద్ద నుండి హిందీ పేపర్ బయటకు వచ్చినట్లు తేలడంతో చీఫ్ సూపరింటెండెంట్ అయిదేళ్ల పాటు డిబార్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదనీ ఇలా పరీక్షలు రాయకుండా డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్ధి వాపోయాడు. గురువారం హరీష్ కమలాపూర్ జడ్ పీ హైస్కూల్ పాఠశాలలో ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి వెళితే .. హనుమకొండ డీఈఓ అతన్ని పిలిచి నీ కారణంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని మందలించారు. పరీక్ష రాయవద్దంటూ అతన్ని బయటకు పంపించడంతో పాటు హాల్ టికెట్ ను తీసుకున్నారు. కుమారుడి బాధ చూసిన హరీష్ తండ్రి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శివకృష్ణ అనే వ్యక్తి గోడ దూకి కమలాపుర్ పరీక్షా కేంద్రంలోకి వచ్చి పరీక్ష రాస్తున్న తన కుమారుడు హరీష్ ను భయపెట్టి హిందీ ప్రశ్న పత్రం తీసుకున్నాడని హరీష్ తండ్రి పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే అతని ప్రశ్నపత్రం తీసుకుని సెల్ ఫోన్ లో ఫోటో తీసుకున్నాడని, అదే వాట్సప్ లో షేర్ అయిందన్నాడు. తన కుమారుడు భయపడే ప్రశ్నాపత్రం ఇచ్చాడని పిటిషన్ లో పేర్కొన్నాడు. మొదటి సారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న తన కుమారుడిని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని హైకోర్టును అభ్యర్ధించారు. దీంతో హరీశ్ ను సోమవారం నుండి మిగిలిన పరీక్షలకు హజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖను ఆదేశించారు.