Hair Style:మనుషులు చాలా సున్నితమైపోయారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఈ క్రమంలోనే బలన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇదే పరిస్థితి. ప్రేమ విఫలం అయ్యిందనో, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లనో..చదవ లేక పోతున్నామనో..ఆర్ధిక ఇబ్బందులనో..ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆత్మహత్య ఘటనల వార్తలను వింటూనే ఉన్నాం. మహారాష్ట్రలో జరిగిన ఓ బాలుడి ఆత్మహత్య ఘటన విస్మయానికి గురి చేస్తొంది.
ముంబై సమీపంలోని భయందర్ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే శత్రుఘ్న పాఠక్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడితో కలిసి సెలూన్ కు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుని తనకు కటింగ్ సరిగా చేయలేదని భావించాడు. షాప్ అతను కటింగ్ చాలా చిన్నగా చేశాడని మనస్థాపానికి గురైయ్యాడు. అతని మనస్థాపాన్ని గమనించిన పాఠక్ తల్లి ఇద్దరు అక్కలు బాలుడికి నచ్చజెప్పారు. కాని ఆ బాలుడి మనసు కుదట పడకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ నిద్ర పోయిన సందర్భంలో అపార్ట్ మెంట్ 16వ అంతస్తు నుండి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.