Andhra Pradesh: వేతనాల పెంపు, ఉద్యోగం భద్రత కోసం అంగన్వాడీ కార్యకర్తలు గత 22 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు కోసం చేసిన హామీలు అప్పుడే మరిచిపోయారా అని అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే నిరసన ఆపేస్తామని లేకపోతే ఆపేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అయితే ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జిల్లా కలెక్టర్ల్ ద్వారా ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది. ఇప్పటికే అంగన్వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరిపారు. అయితే అవి విఫలం అయ్యాయి. దీంతో అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాటపట్టారు. ఈ సమ్మె వల్ల రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులు, శిశువులు ఇబ్బంది పడుతున్నారని.. విధులకు హాజరు కావాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.