హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేటలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క కుదుపుతో ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ట్రైన్ ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ ఆగిపోయింది. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్ రూట్ లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లోకల్ ట్రైన్ నాంపల్లికి వెళ్తున్న సమయంలో.. బేగంపేట, నెక్లెస్ రోడ్డు స్టేషన్ల మధ్య ఒక్కసారిగా ఆగిపోయింది.
కంగారు పడిన ప్రయాణికులు బయటకి పరుగులు తీశారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే టైం అవ్వటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు కొందరిని సమీపంలోని మరో రైల్వే స్టేషన్కు తరలించారు.
లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే ఈ MMTS రైలు బేగంపేట్ నెక్లెస్ రోడ్ల మధ్య ఆగిపోవడంతో ఆఫీసులకు వెళ్లే వాళ్లు, కాలేజీలకు వెళ్లే వాళ్లు అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి బయలు దేరి వేరే మార్గాల ద్వారా తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. కాగా… రైలు ఇలా ఆగిపోవడంతో నగరవాసులు ట్విట్టర్ లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.