తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు రెండో విడత ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. మొత్తం 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మంది సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. నడవలేని వారి కోసం కాలనీల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 8 నెలల కింద తొలి విడత పూర్తి చేయగా.. ఇప్పుడు 100 రోజుల్లో రెండో విడత చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 241 చోట్ల 5058 శిబిరాలు నిర్వహిస్తున్నారు. అమీర్ పేట వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9 గంటలకు, వెంగళరావు నగర్ డివిజన్లో మధురానగర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 10 గంటలకు మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో గల మల్కారంలో మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లో రోజు 15,525 మందికి కంటి వెలుగు సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. కంటి వెలుగు శిబిరాలకు 3,81,445 రీడింగ్ గ్లాసులను పంపించారు.
శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు లేదంటే ఆరోగ్య శ్రీ, లేదా రేషన్ కార్డ్ తీసుకొని రావాలని అధికారులు సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఉచితంగా అద్దాలు, మందులను అందజేస్తారు. అవసరమైన వారికి రీడింగ్ అద్దాలను ఇస్తారు. షార్ట్, లాంగ్ డిస్టన్స్ ఉన్నవారికి 15 రోజుల్లో అద్దాలను ఇంటికి పంపిస్తారు. మరిన్ని వివరాల కోసం ఆశ వర్కర్లు, ఏఎన్ఎంను సంప్రదించాలని అధికారులు సూచించారు.