కేటుగాళ్లు దేనిని వదలడం లేదు. అవును ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటే అక్కడ కరప్షన్ చేస్తున్నారు. చివరికీ వైన్ షాపు టెండర్లను కూడా విడిచి పెట్టలేదు. వైన్ షాపు కోసం టెండర్ వేసే సమయంలో చలాన్ ఇస్తుంటారు. అయితే అందులో రూ.కోటి రూపాయలకు పైగా నకిలీ చలాన్లు ఉన్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందులో బ్యాంక్ క్యాషియర్ పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ స్కాం బయటపెట్టింది ఎక్సైజ్ సీఐ కావడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో నకిలీ చలాన్ల వ్యవహారం బయటపడింది. నకిలీ చలాన్లు సృష్టించిన 11 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి పాత్రపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకోసారి వైన్ షాపులకు టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ఒక్కో వైన్ షాపుకు ఎంతమంది అయినా టెండర్ వేయవచ్చు. కానీ రూ.2 లక్షల చలాన్ అందజేసి, టెండర్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న వారంతా కుమ్మక్కై.. వైన్ షాపులను తీసుకుంటారని అంటుంటారు. అదీ వేరే విషయం.. కానీ వర్ధన్నపేటలో గత ఏడాది జరిగిన అవకతవకలు బయటపడ్డాయి. వైన్ షాపులకు లైసెన్స్ రెన్యువల్ కోసం ఏకంగా ఓ టీమ్ ఫామ్ అయిపోయింది. బ్యాంక్లో పనిచేసే క్యాషియర్ను మచ్చిక చేసుకుంది. అంతా కలిసి రూ.కోటికి పైగా నకిలీ చలాన్లు తయారు చేశారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ విషయం ఎక్సైజ్ శాఖ సీఐ పవన్ వెలుగులోకి తీసుకొచ్చారు.
గతేడాది చలాన్లను సమర్పించారు. మరీ ఇన్నాళ్లకు సీఐ పవన్ బయట పెట్టారు. ఇన్ని రోజులు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆయన పాత్ర కూడా ఉందా అనే సందేహాలు వస్తోంది. దీనిపై పోలీసు విచారణలో నిజ నిజాలు తెలియనున్నాయి. కానీ చలాన్లు తయారు చేసి ఆబ్కారీ శాఖను బురిడీ కొట్టించారు. అధికారులు కూడా ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్లారు. దీంతో ప్రభుత్వానికి కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. లేదంటే ఆ నగదు కూడా సమకూరేది. నిజానికి టెండర్ వేసే సమయంలో ఎన్ని చలాన్లు వచ్చినా అవీ ప్రభుత్వానికి చేరతాయి. వైన్ షాపుల కోసం చాలా మంది టెండర్లు వేస్తుంటారు. కానీ ఒకరికే దక్కనుండగా.. మిగతా వారి డబ్బులు ఆబ్కారీ శాఖకే వెళతాయి.
ఒక షాపు కోసం 10 మంది పోటీ పడితే వారివి రూ.20 లక్షలు వస్తాయి. షాపు ఒక్కరికీ దక్కినందున.. మిగతా 9 మంది కలిపి మొత్తం నగదు వస్తోంది. ఈ డబ్బు నాన్ రీఫండెబుల్ కావున ఆ 18 లక్షలు కూడా తిరిగి ఇవ్వరు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తోంది. అంతకుముందు వైన్ షాపుల టెండర్ కోసం రూ.లక్ష ఉండేది. కానీ ఆ వ్యాపారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా దానిని రూ.2 లక్షలకు పెంచేసింది. గత ఏడాది మద్యం షాపు కేటాయింపులో రిజర్వేషన్ కూడా అమలు చేసింది. గౌడలకు కాస్త ఎక్కువగా షాపులను కేటాయించింది.