తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కేబినెట్‌ను సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలకు దాదాపు పది నెలల ముందు కేబినెట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర అయినా ఆయన స్థానంలో మరొకరికి చోటు దక్కలేదు. దీనికి తోడు మరో ఇద్దరు ముగ్గురు మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్త వారికి చోటు ఇచ్చే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ముగ్గురు మంత్రులను తప్పించి, ఈటల స్థానంతో కలిపి నలుగురికి అవకాశమివ్వవచ్చునని చెబుతున్నారు. ఇటీవల ఫామ్ హౌస్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరికి కేబినెట్లో చోటు దక్కవచ్చునని తెలుస్తోంది. వీరితో పాటు బాల్క సుమన్, కడియం శ్రీహరి, మధుసూదనా చారి, బండ ప్రకాశ్ పేర్లు వినిపిస్తున్నాయి.
మంత్రి మల్లారెడ్డి పనితీరు పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతనిని తప్పించి గ్రేటర్ హైదరాబాద్ నుండి ఒకరికి అవకాశం ఇవ్వవచ్చునని తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ మంత్రికి కూడా ఉద్వాసన పలుకుతారని, ప్రభుత్వ పథకాల విషయంలో సదరు మంత్రి తీరు పట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. జనవరి 15వ తేదీ తర్వాత మంచి రోజు చూసుకొని, కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తారని చెబుతున్నారు. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈటల స్థానంలో అదే సామాజిక వర్గం నుండి బండ ప్రకాశ్‌కు చోటు దక్కుతుందని అంటున్నారు.
అలాగే, సీనియర్ కడియం శ్రీహరికి చోటు దక్కవచ్చునని అంటున్నారు. ఈయనను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ఉద్యమంలో, మొదటి నుండి తమ వెంట ఉన్న బాల్క సుమన్‌కు కూడా చోటు దక్కుతుందని భావిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీలు, ఇళ్లలో ఇటీవల సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అలాగే, ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మీడియాకు ఎక్కిన విషయం తెలిసిందే. కేబినెట్ నుండి ఆయనను తప్పించేందుకే కేసీఆర్ ప్లాన్‌లో భాగంగా ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఎన్నికలకు పది నెలల ముందు కేసీఆర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు.