ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని ఆరోపించారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు అని, అందుకే అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టానన్నారు. మద్యపాన నిషేధం అబద్ధం, రూ.3 వేల పెన్షన్ అబద్ధం, జాబ్ క్యాలెండర్ అబద్ధం, ప్రత్యేక హోదా అబద్ధం, జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని నారా లోకేశ్ స్పష్టం చేశారు. జగన్ను సీఎంను చేసిన వైసీపీ కార్యకర్తలు, నాయకులకు మేలు చేయలేదన్నారు. తమ పార్టీలో అలా కాదని, సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తామని తెలిపారు. మంగళగిరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కాండ్రు శ్రీనివాసరావు వైఎస్సార్ అభిమాని అని తెలిపారు. అతనికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఒక్క శ్రీనివాసరావే కాదు, అభిమానులు అందరినీ వైసీపీ నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. మునిసిపల్ చైర్మన్గా మంగళగిరి పట్టణాన్ని శ్రీనివాసరావు అభివృద్ది చేశారన్నారు.
కరెంట్, బస్సు చార్జీ, ఇంటి, నీటి, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్, నిత్యావసరాల ధరలు జగన్ సర్కార్ పెంచిందని లోకేశ్ ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై లోకేశ్ ఫైరయ్యారు. యాక్టింగ్, స్కిల్స్ చూసి ‘కరకట్ట కమల్ హాసన్’ అని పేరుపెట్టామన్నారు. బర్రెలు, గొర్రెలతో ఫోటోలు దిగడం కాదు.. నియోజకవర్గంలో పెన్షన్ తొలగించిన 5 వేల మందితో ఫోటోలు దిగాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రకటించిన రూ.2600 కోట్లలో రూపాయి అయినా ఖర్చు చేశారా అని నిలదీశారు.
తాను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. 13 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని వివరించారు. జగన్ రెడ్డిలా పరదాలు కట్టుకుని తిరగలేమన్నారు. చంద్రబాబుని సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తనపై 13కి పైగా కేసులు పెట్టారని గుర్తుచేశారు. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అని లోకేశ్ పిలుపునిచ్చారు.