తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ మార్పు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిలో ఉన్నారని, అందుకే పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్రానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు గత నాలుగున్నరేళ్ల నుంచి ఏ పదవీ లేకుండా ఉన్నానని అసహనం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ మార్పు తథ్యం అని ప్రచారం జరిగింది. బీజేపీలో చేరతారని.. అమిత్ షాతో సమావేశం అంటూ.. తెగ హడావిడి జరిగింది. కానీ వాటన్నింటినీ పొంగులేటి తోసిపుచ్చారు. అబ్బే అదేం లేదని తేల్చిచెప్పారు.
పార్టీ మార్పు అంశంపై ఇవాళ (మంగళవారం) పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని.. దొంగచాటుగా పార్టీ మారే అవసరం తనకు లేదని చెబుతున్నారు. ఒకవేళ పార్టీ మారాల్సివస్తే ఖమ్మం నడిబొడ్డున అభిమానుల సమక్షంలో మారుతా అని చెప్పారు. అంటే అమిత్ షాతో సమావేశమై.. ఢిల్లీలో కండువా కప్పుకోనని క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాదు కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టంచేశారు. అదీ ఎక్కడున్నా అని అంటున్నారు. అంటే లోన బీఆర్ఎస్ కావచ్చు.. లేదంటే బీజేపీ కూడా కావచ్చు అని అర్థం వస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో నేతలకు పడటం లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. కానీ వీరిది తలోదారి.. ఎవరికీ వారే యమునా తీరే అన్నచందంగా ఉంటారు. నామా నాగేశ్వరరావు పార్టీ నుంచి ఎంపీగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఏ పదవీ లేదు. ఆయన పార్టీ మారతారని అని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ అవీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
18వ తేదీన ఖమ్మం కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కలేక్టరేట్ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ సభ నిర్వహిస్తారు. సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి తదితరులు హాజరవుతారు. సభ నిర్వహణపై నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అందులో మంత్రి పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు పాల్గొన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో వారి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా కనిపించలేదు.
పార్టీ మార్పు గురించి అదేం లేదని పైకి పొంగులేటి శ్రీనవాస రెడ్డి చెబుతోన్న.. ఆయనను చేర్చుకోవాలని బీజేపీ తెగ ఆరాట పడుతోంది. అందులో భాగంగానే అమిత్ షాతో భేటీకి ఏర్పాటు చేసింది. మరీ ఆ మీట్లో ఇచ్చే హామీలను బట్టి.. పొంగులేటి పార్టీ మారే అవకాశం ఉంటుంది. కానీ అప్పటివరకు మాత్రం తాను పార్టీ మారడం లేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.