కృష్ణా: పామర్రు నియోజకవర్గంలో సోమవారం నిర్వహించనున్న ధర్నాలో MLA అక్రమాలు, ఇసుక దందాలు, దోపిడీలను ప్రజల ముందుకు తీసుకొస్తామని మాజీ MLA కైలే అనిల్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మూడు సెంట్ల భూమిని అర్హులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ప్రస్తుత MLAకు సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల కోసం ఇళ్ల స్థలాల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
MDK: మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అవమానించడం కలకలం రేపింది. విగ్రహం ముఖంపై పేడ కొట్టి, తలపై చెప్పు ఉంచి అపచారం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివరామకృష్ణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
HYD: మియాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సాగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు ఛేదించారు. బెంగళూరులోని నైజీరియన్ల వద్ద MDMA కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన 12.6 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హనుమంతు, మహేష్, ఆదర్శ్‌పై కేసు నమోదు చేశారు.
SDPT: బెజ్జంకిలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న పిల్లలకు కోడిగుడ్లు, బాలామృతం అందజేశారు. తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతపై వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధూమల మహేష్, అంగన్వాడీ టీచర్లు భూదేవి, కనకలక్ష్మి, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం కిష్టంపల్లిలో నూతనంగా మంజూరైన బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారం అందించినట్లు నాయకులు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని వారు పేర్కొన్నారు.
MNCL: స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. ప్రతి నెల రూ.50 వేలు పెన్షన్ , 250 గజాల ఇంటి స్థలం, కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉచిత వైద్య సౌకర్యాలు కొరకు హెల్త్ కార్డు ఇవ్వాలని కోరారు.
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధి కాశిబుగ్గలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. మూడు రోజులుగా నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు రంగు మారి, దుర్వాసన వస్తుండటంతో తాగడానికి వీల్లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వేస్తున్నారు.
తమిళ నటుడు, TVK అధినేత విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా ముగించాలని చూస్తున్నట్లు సమాచారం. కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు ఆమెకు రూ.250 కోట్ల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యక్తిగత విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
TPT: తడ మండలం పెరియవట్టు గ్రామంలో జరిగిన ప్రభాకరన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో వి.దినేష్, వి.సతీష్, వి.విగ్నేష్ అలియాస్ విక్కీ అనే ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, క్రైమ్ నం. 33/2026 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.
VKB: మర్పల్లిలోని పట్లూర్, భూచన్పల్లి, మర్పల్లిలో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో సర్పంచ్ రామేశ్వర్ స్వయంగా పాల్గొని యువతతో కలిసి రంగులు చల్లుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని, సోదరభావం, ఐక్యత మరియు పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
SRPT: మఠంపల్లిలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఇంఛార్జ్ ఎంపీడీవో లావణ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణలో పంచాయితీ కార్యదర్శులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని, ఇది తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చని వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MLG: రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి నీటిని తరలించే ప్రాజెక్టు విషయంలో అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అన్నారు. ములుగు(D)లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని తెలిపారు. భూ సేకరణ ప్రతిపాదనలను 15రోజుల్లో సమర్పించాలని అధికారులకు సూచించారు.
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈనెల 6వ తేదీ నుంచి మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. మార్చి 6వ తేదీన వీరఘట్టం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే, మార్చి 7వ తేదీన జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించి, రాత్రికి పార్వతీపురంలోనే బస చేస్తారు.
అన్నమయ్య: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా ప్రమాదం నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో టపాసుల తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై కఠిన ఆంక్షలు విధించినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. తనిఖీలు పూర్తయ్యే వరకు అన్ని బాణసంచా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. PESO నిబంధనలు, లైసెన్సులు, భద్రతా ప్రమాణాలపై రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో కలిసి పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు కోరారు. బుధవారం ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు. వెంకట రవిచంద్ర కుమార్, రామోజీరావు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.