సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పలు కాలనీల్లో నిండిన డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందివాలని కమిషనర్ కోరారు.
SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నేడు రాత్రి 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్ తెలియజేశారు.
HYD: నగరాల్లో మారుతున్న జీవనశైలితో చాలామంది రోజుకు కనీసం 200 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు కూడా తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రక్తహీనత, మధుమేహం సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 400–500 గ్రాముల వరకు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడంతో విటమిన్లు, ఖనిజాలు అందుతాయని HYD NIN మాజీ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య సూచించారు.
మళయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్ పొడ్యాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 2022లో తనను చిదంబరం వేధించినట్లు ఓ మహిళ ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల మళయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా వెలుగులోకి వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
NZB: సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లను నిన్న ఎత్తారు. ఈ కార్యక్రమంలో TG, MH, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబరు 29 వరకు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాల్సి ఉంటుంది. అదనంగా మార్చి 1న ఒకరోజు 0.6 టీఎంసీల నీటిని కూడా విడుదల చేస్తారు.
మహబూబ్‌నగర్ జిల్లా వాసులు దుబాయ్‌లో ఇరుక్కుపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 360 మందిని టూర్‌కు తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణానికి విమానాశ్రయానికి చేరుకున్న వేళ యుద్ధ పరిస్థితుల కారణంగా ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో వారు అక్కడే నిలిచిపోయారు. అధికారుల జోక్యం కోరుతున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AO సారయ్య హెచ్చరించారు. AO మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు. స్థానిక AEOల వద్ద త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.
SS: చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సైబీరియన్ పక్షులు భారీగా చేరుకుని సందడి చేస్తున్నాయి. ఏటా చలికాలంలో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఈ విదేశీ పక్షులు ఇక్కడి చెట్లపై విడిది చేసి సంతానోత్పత్తి సాగిస్తాయి. స్థానిక ప్రజలు వీటిని దైవసమానంగా భావిస్తూ రక్షణ కల్పిస్తున్నారు. పక్షుల రాకతో ఈ గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయి.
NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. విద్యుత్ మీటర్లతో పాటు రెండు మోటర్లు, తోపుడు పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లక్ష రూపాయలు నష్టపోయానని యజమాని కరిముల్లా వాపోయారు
నటుడు, టీవీకే అధినేత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. విజయ్-సంగీతల విడాకుల వ్యవహారం, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం కుటుంబంలో విభేదాలకు సంకేతమని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా ఇటీవల భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కగా, విజయ్‌కు మరో మహిళతో సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేసింది.
KMM: రఘునాధపాలెం మండలం మంచుకొండ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం మంచుకొండ-పంగిడి దారిలోని ఒక తోటలో దాడులు నిర్వహించి రూ.3వేల నగదుతో పాటు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారవ్వగా మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
JN: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకలం ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన విడుదల చేసింది. రేపు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. మంగళవారం ఆలయంలో సాధారణ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక కార్యక్రమాల అనంతరం భక్తులకు తిరిగి దర్శనం కల్పించనున్నారు.
E.G: గోకవరం మండలంలో పులి సంచరిస్తోందన్న పుకార్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో రాయవరం వద్ద పట్టుబడిన పులిని మారేడుమిల్లి అడవుల్లో విడిచిపెట్టగా, అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి పులి జాడ లేదని స్పష్టం చేశారు. సారా వ్యాపారులే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 63 హైవేపై సోమవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుశీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.