AP: హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అంటే ప్రజల్లో సోదరభావం, సద్భావనను బలోపేతం చేస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును పెంపొందించే ఉత్సాహభరితమైన పండగ అని పేర్కొన్నారు. ఈ పండగరోజు రంగులు చల్లుకోవటం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకం, విశ్వాసం బలోపేతం అవుతుందని చెప్పారు.
KMM: ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి సోమవారం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీఎం సూర్య ఘర్ పోస్టర్‌ను ఆవిష్కరించి, విద్యుత్ ఆదా కోసం ప్రజలు pmsuryaghar.gov.in ద్వారా సోలార్ ప్యానెల్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ADB: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా నల్ల శివన్నను సంఘం సభ్యులు నిన్న ఎన్నుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
KKD: గ్రామీణ అభివృద్ధిలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులను, నేతలను హెచ్చరించారు. పెదపూడి మండలం పైన గ్రామంలోని రోడ్డు పనులపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన సోమవారం సాయంత్రం స్పందించారు. అక్రమాలకు తావులేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
TG: జిల్లాల కలెక్టర్లతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు.
KNR: ఆర్ఎస్ఎస్ అమృతేశ్వర శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ రేకుర్తిలోని మహాశివాలయంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలకు కంటి, షుగర్,బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని నగర కార్యావాహ మహేశ్వర్ పేర్కొన్నారు.
SRD: నిమ్హా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్లో నిమ్హ్పా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్లను ఏర్పాటు చేయాలన్నారు.
KMM: మధిర పట్టణంలోని రాయపట్నం సెంటర్‌లో రోడ్డుపై అడ్డంగా ఆటోలు, టూవీలర్ బండ్లు నిలిపివేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలోనే వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వెళ్లే వారికి మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.
E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి స్థాయి పెంపుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా 2022లో తిరిగి 100 పడకల స్థాయికి పెంచుతూ జీవో తీసుకొచ్చామని చెప్పారు.
NDL: ఆళ్లగడ్డ మండలం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా జ్వాలా నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అర్చకులు రథం వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేసి శుభ ముహూర్తంలో రథాన్ని ముందుకు కదిలించారు.
MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి రక్షణ లేకపోవడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. నాగసాలకు చెందిన భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
W.G: జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
KDP: ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న జిల్లాకు చెందిన పౌరుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న కడప జిల్లావాసులు లేదా వారి బంధువులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 08562-246344 ను సంప్రదించాలని సూచించారు.
CTR: ఏపీ సార్వత్రిక ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు చిత్తూరులోని ఒక పరీక్షా కేంద్రంలో చీటింగ్‌కు పాల్పడిన విద్యార్థిని డిబార్ చేసినట్లు ఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇంగ్లీషు పరీక్షకు నమోదు చేసిన 1,660 మందిలో 1,361 మంది హాజరైనట్లు వెల్లడించారు. జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.
BPT: భట్టిప్రోలులో సోమవారం రాత్రి జరిగిన భ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.