SDPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 17వ తేదీన రైతుబంధు విడుదల చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని, 20వ తేదీ వచ్చినా ఇప్పటికీ నిధులు జమ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడా?, కోతల సమయంలోనా? ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదని, ఈసారి అయినా విడుదల చేస్తారా? అని నిలదీశారు.
SKLM: జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వరుని ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏడుకొండలు పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించారు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం జరిగినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. రూ. 7.31 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.
KNR: కరీంనగర్‌లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.
GNTR: ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం కృష్ణా డెల్టా పంట కాలువలకు మొత్తం 2,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో కృష్ణా పశ్చిమ కాలువకు 2,212, తూర్పు కాలువకు 502, మరియు గుంటూరు ఛానల్‌కు 144 క్యూసెక్కుల నీటిని కేటాయించారు. అలాగే తూర్పు కాలువ ద్వారా కేఈబీకి 302, బందరు కాలువకు 200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.
AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముగించింది. సుదీర్ఘంగా 6 ఏళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ తుది నివేదికను కోర్టుకు సమర్పించగా, కోర్టు దాన్ని ఆమోదించి కేసును మూసివేసింది. 2019లో రీపోస్టుమార్టం కోసం వెలికితీసిన ఆయేషా శరీర అవశేషాలకు ఈ నెల 27న ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.
NLG: జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మామిడాలలో అప్పుల బాధతో సంతోష్ ఉరివేసుకోగా, తిట్టకుంటలో మానసిక స్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేష్ గడ్డిమందు తాగి మృతి చెందాడు.
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 67.226 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 908 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 262 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.
RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం మత సామరస్యాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మసీదు అభివృద్ధి కోసం ఆయన రూ. 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మైనార్టీ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ADB: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
NZB: మక్తల్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు కోచ్‌గా పండు రాథోడ్ నియమితులయ్యారు. పండు రాథోడ్ ప్రస్తుతం కాకతీయ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా జట్టు రాణించేలా ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పండు రాథోడ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించినారు.
KDP: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు. జిల్లాలో 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారన్నారు. 15 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,532 మెట్రిక్ టన్నులు పంట కొనుగోలు చేస్తామన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కట్కామ్ మల్లేశం సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే రూ. 5016ల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలకు రూ. 5016ల చొప్పున ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు.
CTR: జిల్లా ఎస్పీ, నగరి DSP ఆదేశాల మేరకు నిండ్రలోని బాలికల జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరి రూరల్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుపై ప్రభావం చూపే ర్యాగింగు కళాశాలల్లో స్థానం లేదన్నారు. ర్యాగింగ్ జరగకుండా పూర్తిగా నిషేధించినట్టు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
VKB: గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో వికాబాదాబ్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. గతేడాది 73.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.