KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఇవాళ సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.
E.G: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాకరపర్రులో శ్రీ గంటాలమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన గ్రామ దేవత గంటాలమ్మ దేవి కృప దయ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
PLD: తొలితరం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతి సందర్భంగా దుర్గి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సాధనలో కన్నెగంటి హనుమంతు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ADB: హైదరాబాద్‌లో ఈనెల 23 నుంచి 28 వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ క్లస్టర్ పోటీలకు ఆదిలాబాద్ స్విమ్మింగ్ కోచ్ కృష్ణ సాంకేతిక నిపుణుడిగా ఎంపికయ్యారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ స్థాయి పోటీల్లో కీలక బాధ్యతలు దక్కడంపై క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా చేసిన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.
ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 134 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 88 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో తేజల్ (51) అర్ధసెంచరీతో రాణించగా, బౌలింగ్‌లో ప్రేమ రావత్ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
BDK: పాల్వంచ సుగుణ గార్డెన్స్లో ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి మాధురి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాల్ రావు వాణి శ్రీ దంపతుల కుమారుడు సుమంత్, ప్రతాపనేని బుచ్చిబాబు -తనూజ దంపతుల కుమార్తె రేష్మి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
వర్క్ టేబుల్ గజిబిజిగా ఉంటే, మనసు కూడా గందరగోళంగా ఉంటుంది. పని మొదలుపెట్టే ముందే డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అనవసరమైన వస్తువులను తొలగిస్తే ఒత్తిడి తగ్గి, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా, దుమ్ము వల్ల వచ్చే అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ శుభ్రం చేయడం, వస్తువులను క్రమ పద్దతిలో ఉంచడం వంటివి చేయాలి.
SKLM: మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 175వ వర్ధంతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు హాజరై, నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి తరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని అన్నారు.
SDPT: ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జానపద గాయకుడు ఇట్టబోయిన స్వామి, కానిస్టేబుల్ దయ్యాల లక్ష్మణ్‌ను ఘనంగా సత్కరించారు. సోషల్ మీడియాలో ‘గుజారి’ పాటతో స్వామి 5 మిలియన్ల వ్యూస్ సాధించగా, బాడీ బిల్డింగ్లో లక్ష్మణ్ స్టేట్ సెకండ్ సాధించారు. ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వీరి విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.
ATP: హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే తమ ప్రధాన లక్ష్యం అని రైతు సంఘం నాయకులు గోవింద్ పేర్కొన్నారు. గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలు మళ్లించడానికి నిధులు కేటాయించాలని గత రెండు రోజులుగా చేస్తున్న సామూహిక దీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
KKD: పిఠాపురం ప్రాంతాభివృద్ధి సంస్థ (పాడా) కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. బాధితులు ప్రత్యక్షంగానే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆయన సూచించారు.
SRD: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి వరకు 161.5 కి.మీల మేర 6వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్హెచ్-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాష్ రూమ్‌లలో నీరు లేక దుర్వాసన వ్యాపించడంతో రోగులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన పై అధికారులు స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ గుడ్డిగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శించాడు. బంతి స్లాట్‌లో పడితే తప్ప అతడు షాట్లు ఆడలేడని, ఆఫ్ సైడ్ వచ్చే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం అతడి బలహీనత అని పేర్కొన్నాడు. అభిషేక్ తన ఆటతీరును మెరుగుపరుచుకోకపోతే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగలేడని హెచ్చరించాడు.