అత్తాకోడళ్ల మధ్య సంబంధం అంటేనే టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది వారి మధ్య జరిగే తగవులాట. తల్లి, భార్య గొడవల మధ్యలో భర్త నలిగిపోవడం భారతీయ కుటుంబాల్లో సర్వసాధారణ విషయమే. అయితే ఈ సంసార కష్టాల నుంచి రాజకీయ నాయకులు, స్టార్ హీరోలు కూడా అతీతం కాదు. బాలీవుడ్ లో అగ్రశ్రేణి నటుడిగా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంట్లోనూ ఈ సంసార కష్టాలు మొదలయ్యాయి. భార్య, తల్లి గొడవ పడడంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అత్తాకోడళ్ల మధ్య ఆస్తి తగాదాలు రచ్చకెక్కే స్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య జైనాబ్. వీరిద్దరికీ 2010లో వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు యాని సిద్దిఖీ, షోరా సిద్ధిఖీ. తల్లితో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. అయితే 2020లో నవాజుతో విడాకులు కావాలని జైనబ్ కోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ 2021లో కేసు వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. అయితే నవాజుద్దీన్ తల్లి మెహ్రఉన్నీసాతో జైనాబ్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోడలు తనతో గొడవ పడుతోందని, దుర్భాషలాడుతూ.. దాడి కూడా చేస్తోందని నవాజుద్దీన్ తల్లి మెహ్రఉన్నీసా వాపోయింది. ఈ మేరకు ముంబైలోని వెర్సోవా పోలీసులకు కోడలు విషయమై ఫిర్యాదు చేసింది. జైనాబ్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య గొడవలో నవాజుద్దీన్ తలదూర్చడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఎటు వైపు నిలిచినా కష్టమే. తల్లి వైపు ఉంటే భార్యకు.. భార్య వైపు ఉంటే తల్లికి కోపం. అందుకే మీ కొట్లాట ఏదో మీరే తేల్చుకోండి అనే ధోరణిలో నవాజుద్దీన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటివరకు నవాజుద్దీన్ స్పందించడం లేదు.