Viral News: జీపీఎస్ ఉంది చింతలేదనుకున్నారు… చిక్కుల్లో పడ్డారు
ప్రస్తుతం మనిషి తన మీద కంటే టెక్నాలజీ నే గుడ్డిగా నమ్మేస్తున్నాడు. మనిషి తప్పు చేయవచ్చు గానీ సాంకేతిక పరికరాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవని అతడి నమ్మకం. ఇలా గుడ్డిగా నమ్ముకున్నా కొంత మంది పర్యాటకులు ఇబ్బందుల్లో పడ్డారు.
Viral News: ప్రస్తుతం మనిషి తన మీద కంటే టెక్నాలజీ నే గుడ్డిగా నమ్మేస్తున్నాడు. మనిషి తప్పు చేయవచ్చు గానీ సాంకేతిక పరికరాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవని అతడి నమ్మకం. ఇలా గుడ్డిగా నమ్ముకున్నా కొంత మంది పర్యాటకులు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఘటన అమెరికా(USA)లోని హవాయి(Hawaii) రాష్ట్రంలో చోటు చేసుకొంది. పూర్తిగా జీపీఎస్ పైనే ఆధారపడిన పర్యాటకుల పరిస్థితి ఘోరంగా తయారైంది. నేరుగా వెళ్లి సముద్రంలో పడ్డారు. ఆ చుట్టపక్కల పడవల వాళ్లు చూసి నీటిలో దూకి వారిని కాపాడడంతో బతుకు జీవుడా అన్నట్లైంది వారి పరిస్థితి.
ఆ రేవులో ఉన్న వారు కారు నేరుగా సముద్రంలోకి దూసుకు రావడం చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. కైలువా-కోన ప్రాంతంలోని హూనోకోహౌ స్మాల్బోట్ హార్బర్లో ఇద్దరు పర్యాటకులు శనివారం ఒక భారీ ఎస్యూవీలో వచ్చారు. వారు మాంటరే ఎక్స్కర్షన్ అనే ప్రదేశానికి వెళ్లేందుకు జీపీఎస్ ఫాలో అవుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ నేరుగా హార్బర్లోకి దూసుకెళ్లి సముద్రంలో పడింది. అక్కడ ఉన్న పడవలలోని సిబ్బంది చూసి వెంటనే నీటిలోకి దూకి కారులో చిక్కుకుపోయిన ప్రయాణికురాలిని వెలికి తీయగా.. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సమయంలో వారు సీట్ బెల్ట్లు పెట్టుకొని ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆ కారుకు తాళ్లు కట్టి ఒడ్డుకు లాగారు. కారులో ప్రయాణించేవారు తాము సముద్రం దిశగా వెళుతున్నామన్న ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.