రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
Manipur Violence: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తమకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్(Chief Minister N. Biren Singh) తెలిపారు. ఈ ఉగ్రవాదులు సాధారణ పౌరులపై M-16, AK-47 అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్లను ఉపయోగిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇళ్లను తగలబెట్టేందుకు వచ్చారు. సైన్యం, ఇతర భద్రతా దళాల సహాయంతో వారిపై చాలా బలమైన ప్రతిఘటన చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు.
నిరాయుధులైన పౌరులపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని సీఎం బీరెన్ సింగ్ పేర్కొన్నారు. మణిపూర్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఉగ్రవాదులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతోంది. మీడియా నివేదికల ప్రకారం, తిరుగుబాటుదారులు గత రాత్రి రెండు గంటల సమయంలో ఇంఫాల్ లోయ(Imphal Valley), దాని పరిసర ఐదు ప్రాంతాలపై దాడి చేశారు. వీటిలో సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ ప్రాంతాలు ఉన్నాయి. అనేక ఇతర ప్రాంతాల్లో, కాల్పులు, రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు గురించి సమాచారం తెరపైకి వచ్చింది.
సెక్మాయిలో ఎన్కౌంటర్ ముగిసినట్లు చెబుతున్నారు. ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) వైద్యులు ఫయెంగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన స్థితిలో 10 మంది ఆసుపత్రికి చేరుకున్నారని చెప్పారు. అదే సమయంలో, బిషన్పూర్లోని చందోన్‌పోక్పిలో 27 ఏళ్ల రైతు ఖుమంతెం కెన్నెడీ బుల్లెట్లు తగిలి మరణించాడు. అతని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. చాలా మంది చనిపోయారని భయపడుతున్నారు. కెన్నెడీకి అతని భార్య, పాప, కుమారుడు ఉన్నారు.
రేపు మణిపూర్ లో అమిత్ షా పర్యటన
హోంమంత్రి అమిత్ షా రేపు మణిపూర్‌లో పర్యటించనున్నారు. శాంతిని కాపాడాలని, సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని మెయిటీ, కుకీ కమ్యూనిటీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాష్ట్రానికి వచ్చి శాంతిభద్రతలను సమీక్షించారు. ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల నివసించే మెయిటీ ప్రజలకు , కొండలలో నివసించే కుకీ తెగకు మధ్య జాతి హింస కొనసాగుతోంది. మెయిటీ ప్రజలను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ ఉంది. ఈ విషయమై కుకీ సంఘంతో తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఇప్పటి వరకు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మే 3న ఘర్షణ మొదలైంది.