CM KCR: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అన్న మాటలను గుర్తుచేశారు. ఏపీలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనొచ్చని బాబు అనేవారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 5 నుంచి 10 ఎకరాల భూమి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పటాన్ చెరులో రూ.183 కోట్లతో నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. తర్వాత ఏపీ, తెలంగాణ పరిస్థితి గురించి వివరించారు.
గత కొన్నేళ్ల నుంచి తెలంగాణ రాస్ట్రంలో భూముల ధరలు పెరిగాయని.. అదే ఏపీలో తగ్గాయని చెప్పారు. మంచి ప్రభుత్వం ఏర్పడటం, అభివృద్ధి కావడంతో భూముల ధర పెరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు వస్తోందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, డివిజన్‌కు రూ.10 కోట్ల నగదు ఇస్తామని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కూడా చేస్తామని హామీనిచ్చారు.
పటాన్ చెరు వేగంగా డెవలప్ అవుతుందని.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ఇక్కడ కరెంట్ కోసం సమ్మె చేసేవారని గుర్తుచేశారు. 24 గంటలు విద్యుత్ ఇవ్వడం వల్ల పరిశ్రమలు మూడు షిప్టుల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు 24 గంటల పవర్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. హైదరాబాద్ నలుదిక్కులా 5 పెద్ద ఆస్పత్రులు వస్తున్నాయని వివరించారు.