వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిని తానేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మంగళవారం చెప్పారని గుర్తు చేశారు. కౌశిక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయాడు. 2021 జూలైలో ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం కౌశిక్ రెడ్డికి టిక్కెట్ ఇస్తామని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కౌశిక్ హైదరాబాద్ జట్టుకు దేశవాళీ క్రికెట్లో ప్రాతినిథ్యం వహించాడు. 2004లో తొలి మ్యాచ్ ఆడిన కౌశిక్, 2007లో తన ఆటకు ముగింపు పలికి, రాజకీయాల్లోకి వచ్చాడు. 2021 చివరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఆయన పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం.
బుధవారం కౌశిక్ రెడ్డి ఇతర అంశాలపై కూడా స్పందించారు. గవర్నర్ తమిళసాయి ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా నడిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. తనకు మహిళలు అంటే గౌరవం ఉందని, గవర్నర్ తీరు వల్లే తాను అలా మాట్లాడవలసి వచ్చిందన్నారు. శాసన సభలో ఆమోదం పొందిన అభివృద్ధి బిల్లులను ఆపివేయడంతో కడుపు మండి అలా మాట్లాడినట్లు చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు, హుజురాబాద్ ఎమ్మెల్యే… ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హుజురాబాద్లో త్వరలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, ఈటెలను గౌరవంగా ఆహ్వానిస్తామని చెప్పారు.